స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. జి20 శిఖరాగ్ర సమావేశాన్ని ఇది వరకు న్యూఢిల్లీలో నిర్వహించినప్పుడు 2030కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు, ఇంధన సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జి20 తీర్మానించిందని ఆయన గుర్తు చేశారు. స్థిరాభివృద్ధి సాధనకు సంబంధించిన ఈ ప్రాథమ్యాలను ముందుకు తీసుకు పోవాలని బ్రెజిల్ నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు.
అభివృద్ధి సాధనను దీర్ఘకాలం కొనసాగించే దిశగా భారతదేశం తీసుకున్న నిర్ణయాలను ప్రధాని వివరించారు. భారతదేశం గత పదేళ్ళలో 4 కోట్ల కుటుంబాలకు గృహ వసతినీ, గడచిన అయిదేళ్ళలో 12 కోట్ల కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటినీ అందుబాటులోకి తెచ్చిందనీ, 10 కోట్ల కుటుంబాలకు కాలుష్యానికి అస్కారంలేని వంటింటి ఇంధనాన్నీ, 11.5 కోట్ల కుటుంబాలకు టాయిలెట్ సదుపాయాలను సమకూర్చిందని ఆయన తెలిపారు.
పారిస్ వాగ్దానాలను నెరవేర్చిన జి20 సభ్య దేశాలలో తొలి దేశం భారతదేశమేనని ప్రధాని తెలిపారు. 2030 కల్లా 500 గిగా వాట్ (జీడబ్ల్యూ) పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న మహత్తర లక్ష్యాన్ని భారత్ పెట్టుకొందని, ఈ లక్ష్యంలో ఇప్పటికే 200 గిగావాట్ ఇంధన ఉత్పత్తికి చేరుకొందన్నారు. భారత్ అమలు చేస్తున్న మరికొన్ని కార్యక్రమాలను గురించి కూడా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో.. భూమిని ఎక్కువకాలం మనుగడలో ఉండేటట్లుగా మలచడానికి ఉద్దేశించిన గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ (వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్), మిషన్ లైఫ్, కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ), అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్) ఉన్నాయని ఆయన వివరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలలో స్థిరాభివృద్ధికి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమిట్ మూడో సంచిక నిర్వహణ వేళ భారతదేశం ప్రకటించిన గ్లోబల్ డెవలప్‌మెంట్ కంపాక్ట్ కు మద్దతును అందించాల్సిందిగా సభ్య దేశాలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.