ఈ సంవత్సరం ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ (ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – ‘ఐఎఫ్ఎఫ్ఐ’)లో వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ లో ప్రదర్శించడానికి అధికారికంగా ఎంపిక చేసిన ఆరు అసాధారణ ఫిక్షన్ సినిమాల వివరాలను ఫిలిమ్ బజార్ ప్రకటించింది.
ఎంపికైన చలన చిత్రాలు ఇవీ..:
1. త్రిబేణీ రాయ్ (నేపాలీ చిత్రం) షేప్ ఆఫ్ మోమోస్
2. శక్తీధర్ బీర్ (బెంగాలీ చిత్రం) గాంగ్‌శాలిక్ (గాంగ్‌శాలిక్ – రివర్ బర్డ్)
3. మోహన్ కుమార్ వలసల (తెలుగు చిత్రం) ఎర్ర మందారం
4. రిధమ్ జన్వే (గద్దీ, నేపాలీ చిత్రం) కాట్టీ రీ రాట్టీ
5. సిద్ధార్థ్ బాడీ (మరాఠీ చిత్రం) ఉమాల్
6. వివేక్ కుమార్ (హిందీ చిత్రం) ద గుడ్, ద బ్యాడ్, ద హంగ్రీ.
వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ ఈ సంవత్సరం కూడా ఇటు ఆఫ్‌లైన్ సమావేశాలతో పాటు, అటు ఆన్‌లైన్ సమావేశాలను నిర్వహించనుంది. ఈ పద్ధతి దర్శకులు, గురువులు వాస్తవ కాల ప్రాతిపదికన మేధోమథనం జరపడానికి, పోస్ట్- ప్రొడక్షన్ సంబంధిత అండదండలను ఏయే విధాలుగా అందుకోవచ్చో తెలుసుకొనే అవకాశాన్ని ఇస్తుంది.
ఎంపిక చేసిన ఆరు చలనచిత్రాలలో అయిదు చలన చిత్రాలు యువ దర్శకుల, వర్ధమాన దర్శకుల తొలి ప్రయత్నాలే. ఈ సినిమాలు వైవిధ్య భరిత చిత్ర కథాకథనాలను కళ్ళకు కట్టడం ఒక్కటే కాకుండా సంస్కృతిని లోతుగా పరిశీలించే దృష్టి కోణాల్లోని వైశిష్ట్యానికి కూడా అద్దం పడతాయి. ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ (ఐఎఫ్ఎఫ్ఐ) ఈ నెలతో 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. మరి ఇది తన శ్రద్ధను యువ చలనచిత్ర రూపకర్తలపై కేంద్రీకరిస్తూ, వారు కథను చెప్పే సరికొత్త పద్ధతులకు ప్రాచుర్యాన్ని కల్పిస్తోంది.
సృజనాత్మకతను పెంచి పోషించడానికి అండదండలను అందివ్వాలన్న ఐఎఫ్ఎఫ్ఐ నిబద్ధతను వర్స్-ఇన్-ప్రోగ్రెస్ (డబ్ల్యూఐపీ) విభాగం ప్రతిబింబిస్తోంది. వర్తమాన జీవన సంక్లిష్టతలను నవతరం కళాకారులు తాము అవగాహన చేసుకున్న తీరులను భిన్న అభిరుచులు కలిగి ఉండే ప్రేక్షకుల ముందుకు తీసుకు పోవాలనే ఉద్దేశం కూడా వర్స్-ఇన్-ప్రోగ్రెస్ విభాగానికి ఉంది. ఇది సినిమా రంగానికి ఎంతో ఉద్వేగ భరితమైన ఘట్టం. చలనచిత్ర రంగంలోకి పొలికేక పెడుతూ ప్రవేశించిన ప్రతిభామూర్తులను రెండు చేతులూ చాచి ఆప్యాయంగా ఆహ్వానించడంలో ఫిలిమ్ బజార్ ముందు వరుసలో నిలుస్తోంది.
వర్క్–ఇన్–ప్రోగ్రెస్ ల్యాబ్ ను గురించి…
థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో తీసిన సినిమాలను ప్రోత్సహించడానికే అచ్చంగా వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో ప్రతి ఏటా గరిష్ఠంగా ఆరు చలన చిత్రాలను ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఆయా చిత్రాల దర్శకులు, ఎడిటర్లు వారి వారి రఫ్ కట్స్ ను ప్రసిద్ధ గురువుల మండలికి నివేదించి, ఆ గురువులు అందించే అమూల్యమైన సూచనలనూ, సలహాలనూ అందుకొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకొంటారు. దేశ విదేశాలలో లబ్ధ ప్రతిష్టులైన ఎడిటర్లు ఎంపిక చేసిన చలనచిత్ర రూపకర్తలకు ఎడిటింగ్ సెషన్లను నిర్వహించి తగిన మార్గదర్శకత్వాన్ని అందించి, ఆయా దర్శకులు వారి పనితనానికి మెరుగులు పెట్టుకొనేందుకు సాయపడతారు. గురువులుగా వ్యవహరించే వారిలో పరిశ్రమలోని వృత్తి నిపుణులు, ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్లు, విమర్శకులు, నిర్మాతలు, తల పండిన ఎడిటర్లు.. ఇలా విభిన్న వర్గాల వారు ఉంటారు. సాన పట్టిన ఒక తుది చలన చిత్రాన్ని ఏ విధంగా ఆవిష్కరించాలో వీరంతా కలసి చలనచిత్ర రంగ ఔత్సాహికులకు బోధిస్తారు.
వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ 2008లో ప్రారంభమైనప్పటి నుంచి తీర్చిదిద్దిన చలనచిత్రాలు… ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రీమియర్ (మొట్టమొదటి ప్రదర్శన)కు నోచుకొన్న గౌరవాన్ని పొందాయి. విమర్శకుల ప్రశంసలను కూడా రాబట్టుకొన్నాయి. ఈ భాగ్యాన్ని దక్కించుకొన్న చిత్రాలలో పుతుల్ నాచేర్ ఇతికథ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2023), శివమ్మ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2021, బుసాన్ 2022 విజేత), ఏక్ జగహ్ అప్నీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2021), పోవై (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2020 ), పాకా (రివర్ ఆఫ్ బ్లడ్ ) (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2020), పెడ్రో (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2019), శంకర్స్ ఫెయిరీస్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2019), లైలా ఔర్ సాత్ గీత్ (గొర్రెలను కాపాలా కాసే మహిళ – ఏడు గీతాలు) (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2019), ఫైర్ ఇన్ ద మౌంటెన్స్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2019), ఈబ్ ఆలే ఊ! (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2018), సోనీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2017), ది గోల్డెన్–లేడెన్ షీప్ అండ్ ది సేకెడ్ మౌంటెన్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2016), లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2015) థీథీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2014), తిత్ లీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2013), కిల్లా (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2013), తుంబడ్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2012), మిస్ లవ్లీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2011), ఇంకా షిప్ ఆఫ్ థీసియస్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2011) లు ఉన్నాయి.
ఫిల్మ్ బజార్ ను గురించి…
ఫిలిమ్ బజార్ ఒక బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) వేదిక. ఇది దక్షిణాసియా ప్రాంత చలనచిత్రాలకు జాతీయ విపణిలోను, అంతర్జాతీయ విపణిలోను ఆదరణ లభించేటట్లు చొరవ తీసుకొంటుంది. ఫిల్మ్ బజార్ లో వ్యూయింగ్ రూమ్ ఒక చెల్లింపు ప్రధానమైన వేదిక. ఇది దర్శకులకు వారి చిత్రాన్ని వారంతట వారే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో, వరల్డ్ సేల్స్ ఏజెంట్లు, ఇంకా కొనుగోలుదారులకు ప్రదర్శించుకొని ప్రచారం చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది.