శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని పేరు పెట్టారు) ను గోవాలో నిర్వహిస్తున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ..‘ఇఫీ’) లో ముగింపు చిత్రంగా ఉంది. చాలా కాలంగా ప్రేక్షకలోకం ఆత్రంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం గురించి తెలియజేయడానికి పత్రికావిలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిత్రంలో పర్యావరణాన్ని గురించి, తరాలవారీగా తలెత్తుతున్న సవాళ్ళను గురించి ప్రధానంగా చర్చ సాగింది.
పచ్చని పైరులతో నిండిన పంట పొలాల మధ్య చిత్ర కథ జోసెఫ్ అనే యాభై ఏళ్ళ వయసున్న రైతు అతడి భార్య ఇవా, ముగ్గురు పిల్లలతో కలసి చక్కని జీవనం గడపాలని తపిస్తూ ఉండడాన్ని సూచిస్తూ ఆరంభమవుతుంది. లాభాల కోసం వ్యవసాయాన్ని వ్యాపారంగా నడిపే యజమాని విక్టర్ తో జోసెఫ్ తరచు గొడవపడుతుంటాడు. దుర్భిక్షం కారణంగా పల్లెలో తాగునీటి ఎద్దడి తలెత్తడంతో కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతాయి. దీనికి తోడు, విక్టర్‌కు తన కొడుకుతో విభేదాలు వచ్చి కథ పాకాన పడుతుంది.
మానవులకు, పర్యావరణానికి మధ్య ఉన్న విశ్వజనీన బంధానికి అద్దం పడుతూ, ప్రాకృతిక వనరులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దర్శకుడు శ్రీ బోదాన్ స్లామా మొదట సూచిస్తారు. ఇది మనిషి తనలోని అంతరాత్మను కాపాడుకోవడం వంటిదేనని ఆ తరువాత ఆయన మార్మికంగా చెబుతూ పోతారు. ఈ చిత్ర కథకు తెర రూపాన్ని ఇవ్వడానికి మూడేళ్ళు పట్టిందని, ఒకసారి రాసింది మళ్ళీ తిరగరాస్తూ అలా మొత్తం పదకొండుసార్లు మెరుగులు దిద్దానని ఆయన సమావేశంలో వెల్లడించారు. ఈ చలనచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో తనకు నటీనటులు, చిత్ర నిర్మాతలు ఎంతగానో సహకరించారంటూ వారికి ఆయన కృతజ్ఞత తెలిపారు.
నిర్మాత శ్రీ పీటర్ ఓక్రోపెక్ చిన్న దేశాలలో కళాత్మకత ప్రధానమైన చలనచిత్రాలను నిర్మించడం, అందుకు నిధులను సేకరించడంలో ఉన్న కష్టాలను గురించి వివరించారు. అంతర్జాతీయ సహకారం లభిస్తే బాగుంటుందనేది ఆయన అభిప్రాయం. మానవజాతి మనుగడ దీర్ఘకాలంపాటు కొనసాగడం, కుటుంబ విలువలు, తరాల మధ్య అంతరాలు వంటి అంశాలపై దృష్టి పెట్టిన ఈ చిత్రం ప్రపంచంలో ఏ మూలనైనా ప్రేక్షకుల హృదయాలను స్పర్శించగలిగే విధంగా ఉందంటూ, ఈ చిత్రం సందర్భోచితంగా రూపుదిద్దుకొందని, ఇప్పుడున్న వాతావరణాన్ని ప్రతిఫలిలంచిందంటూ శ్రీ పీటర్ ఓక్రోపెక్ మెచ్చుకొన్నారు.
చిత్ర కథ సమకాలీన విషయాలకు అద్దం పడుతుందని, యువ ప్రేక్షకలోకం వారి భవిష్యత్తును వారంతట వారే తీర్చిదిద్దుకోవాలని, చిత్ర నిర్మాత అంటున్నారు. ‘డ్రై సీజన్’ ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా సార్థక మాటామంతీని మొదలుపెట్టి, చూపరులకు మానవత, ఇంకా ప్రకృతికి మధ్య గల సున్నిత సమతుల్య బంధాన్ని గుర్తు చేస్తూ ఉంటుందన్న ఆశను దర్శకుడు శ్రీ బోదాన్ స్లామా వ్యక్తం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని ముగించారు.