गुरुवार, नवंबर 14 2024 | 09:44:50 PM
Breaking News
Home / Choose Language / telugu / భారతీయ సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని రాష్ట్రీయ ఏక్తా పర్వ్ వేడుకలు ప్రతిబింబిస్తాయి: జి.కిషన్ రెడ్డి

భారతీయ సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని రాష్ట్రీయ ఏక్తా పర్వ్ వేడుకలు ప్రతిబింబిస్తాయి: జి.కిషన్ రెడ్డి

Follow us on:

గౌరవనీయులైన ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో ‘‘ఏక్ భారత్, శ్రేష్ట భారత్’’ భావన కేంద్రంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలిశామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. తిరుమలగిరిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో ఈ రోజు జరిగిన జాతీయ స్థాయి రాష్ట్రీయ ఏక్తా పర్వ్ ఉత్సవాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు.

ప్రతి కేంద్రీయ విద్యాలయాన్ని మినీ ఇండియాగా పోల్చుతూ, ఇవన్నీ శక్తిమంతమైన, పూర్తి సామర్థ్యంతో నిండినవిగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అభివర్ణించారు. కేంద్రీయ విద్యాలయాల ద్వారా విద్యను అందించడమే కాకుండా, జాతీయ ఏకతా స్ఫూర్తిని పెంపొందిస్తున్నాం. ఈ పాఠశాలలు భారతదేశ స్వభావమైన భిన్నత్వంలో ఏకత్వమనే సౌందర్యాన్ని సూచిస్తాయి. ఇక్కడ వివిధ భాషలు, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన విద్యార్థులు ఒక్క చోట చేరి, జీవితాంతం కొనసాగే బంధాలను ఏర్పరుచుకుంటారు. కేంద్రీయ విద్యాలయాలు విద్యాసంస్థల కంటే ఎక్కువ. ఎందుకంటే అవి జ్ఞానాన్ని, విలువలను, వ్యక్తిగత వృద్ధి అవకాశాలను పరస్పరం పంచుకునే సమూహాలు.

కేంద్రీయ విద్యాలయకు చెందిన విద్యార్థుల ఉత్సుకత, సృజనాత్మకత అందరికీ స్ఫూర్తినివ్వడంతో పాటు దేశంలోనే ఉత్తమ ప్రతిభను వారు ప్రదర్శిస్తున్నారని మంత్రి అన్నారు. శతాబ్దాల నాటి మన సుసంపన్నమైన నాగరికత ప్రపంచాన్ని సానుకూలంగా ప్రభావితం చేసింది. విశ్వగురు – మార్గదర్శక వెలుగుగా, విశ్వ మిత్ర – ఎంతోమందికి స్నేహితునిగా వ్యవహరిస్తోంది. రాష్ట్రీయ ఏకతా పర్వ్‌లో భాగంగా, ఘనమైన దేశ సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని మనం ప్రేమతో  ఉత్సవంలా జరుపుకుంటున్నాం. భిన్నత్వం ఉన్నప్పటికీ వివిధ సమూహాలు, సంస్కృతులు, సంప్రదాయాల మధ్య గౌరవం,  అవగాహనను పెంపొందిస్తూ, కలసి ఉండటంలోనే మన బలం దాగి ఉంది. ఇదే మన దేశంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఈ కార్యక్రమం మన విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో భారత దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అనుసంధానిస్తుంది. ప్రధానమమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలకు అనుగుణంగా మన సంస్కృతితో మనల్ని ఏకం చేస్తుంది. అలాగే కాలతీతంగా అనుసరించాల్సిన విలువల ఆవశ్యకతను తెలియజేస్తుంది.

2047 లక్ష్యం గురించి వివరిస్తూ, ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో యువత పోషించే కీలక పాత్రను గుర్తించామని మంత్రి తెలిపారు. నేటి విద్యార్థులు రేపటి పౌరులు మాత్రమే కాదని, ప్రగతి, సంక్షేమం దిశగా భారత్‌ను నడిపించే రథసారథులని పేర్కొన్నారు. చరిత్రలో ఆదిశంకర నుంచి సర్దార్ పటేల్ వరకు ఎందరో నాయకులు  భారత్‌లో జన్మించారని, మన ఆదర్శాలను నిలబెట్టడానికి, మన గుర్తింపును బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. మన దేశం వికసిత్ భారత్ – అభివృద్ధి చెందిన భారత్‌గా మారాలని ఆకాంక్షిస్తోంది. మన యువతే మనకున్న గొప్ప నమ్మకం, ఆస్తి. సమాజంలో వివిధ రంగాల్లో తమవంతు సహకారాన్ని అందిస్తున్న యువ మేధను చూసి నేను ప్రేరణ పొందుతున్నాను.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలోని ప్రభుత్వం… కలలను సాకారం చేసుకునే దిశగా యువతను నడిపించేందుకు కృతనిశ్చయంతో ఉందని మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థిలో దాగున్న శక్తిని వెలికి తీసేలా జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేశారు. అలాగే క్రీడలు, కళలు, విలువలు, సాంస్కృతిక అవగాహనతో కూడిన అభ్యాస విధానాలను అవలంబించి తర్వాతి తరాన్ని విస్తృతమైన ఆకాంక్షల సాధన కోసం సన్నద్ధం చేయడం కూడా దీనిలో భాగమే. విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించి, క్రీడాధారిత పద్ధతిలో నేర్చుకోవడాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. చిన్నారుల్లో నైపుణ్యాలను పెంపొందించి 21వ శతాబ్దపు నాయకులుగా మారేలా మార్గనిర్దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది నూతన భారత దేశం – స్వయం సమృద్ధం సాధించి ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు సిద్ధంగా ఉంది.

ఈ ప్రయత్నాల ద్వారా మనం కలలు కంటున్న స్వయం సమృద్ధ భారతాన్ని నిర్మించే క్రమంలో యువతను శక్తిమంతులను చేసి, క్రియాశీలక పాత్రను పోషించేలా వారిని సిద్ధం చేసేందుకు అవిశ్రాంతంగా మేం కృషి  చేస్తున్నాం. వ్యవసాయం నుండి రక్షణ, ఆవిష్కరణలు, ఆరోగ్యం రంగం ఇలా వివిధ రంగాల్లో భారత్ ప్రస్తుతం బలంగా ఉంది. మన యువత ఈ దేశ ఆత్మ, భవిష్యత్తును తనలో నింపుకుందని నేను విశ్వసిస్తున్నాను. భారతదేశ అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడంలోనూ, ప్రధానమంత్రి ఆకాంక్షలను నిజం చేయడంలో యువత పాత్ర కీలకం.  వారిని రేపటి తరం నాయకులుగా చూస్తున్నాను. తాము ఎంచుకున్న మార్గాల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారని నేను భావిస్తున్నాను. మీ జీవితం ఎటువైపు సాగినా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ముందున్న ప్రయాణ మార్గాన్ని స్వీకరించాలని విద్యార్థులకు కేంద్ర మంత్రి సూచించారు. శక్తివంతమైన దేశంగా మారాలని భారత్ ఉవ్విళ్లూరుతున్న తరుణంలో ఈ రోజు కీలకమైన సందర్భంగా నిలిచిపోతుంది. మనమంతా కలసి దేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించే స్థానానికి చేర్చే బాధ్యతను పంచుకుందాం. దేశంలోని యువత ఇప్పటికే వివిధ రంగాల్లో ప్రగతిని సాధిస్తున్నారని, మన భవిష్యత్తును రూపొందిస్తున్నారని మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఇ. రాజేందర్, న్యూఢిల్లీలోని పాఠశాల విద్య, అక్ష్యరాస్యత, విద్యా శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ గౌరవ కమిషనర్ శ్రీమతి నిధిపాండే, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ జాయింట్ కమిషనర్ (అకడమిక్స్) డాక్టర్ దేవ్ కుమార్, హైదరాబాద్ ప్రాంత డిప్యూటీ కమిషనర్ శ్రీ డి. మంజునాథ్, సహాయక కమిషనర్లు, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ద్వారా జాతీయ సమగ్రతను ప్రోత్సహించేందుకు, భారతీయ సంస్కృతి, కళలను ప్రశంసించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమమే రాష్ట్రీయ ఏక్తా పర్వ్. వివిధ రాష్ట్రాల సుసంపన్నమైన వారసత్వం, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతిని ప్రదర్శించడం కూడా ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. సర్దార్ వల్లభభాయ్ పటేల్ అందించిన వారసత్వాన్ని గౌరవిస్తూ దేశ ఐక్యతను బలోపేతం చేయడంలో విద్య ప్రాముఖ్యాన్ని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ తెలియజేసింది. సాంస్కృతిక వైవిధ్యం, కళాత్మక ప్రతిభను ప్రదర్శించిన ఈ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్టభారత్ స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచింది.

ఈనెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో బృంద గానం, బృంద నృత్యం, ఇతర కళాపోటీలు నిర్వహిస్తారు. వీటిలో కేవీఎస్‌లకు చెందిన విద్యార్థులు పాల్గొంటారు. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ సాగిన ఈనాటి ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

కేంద్ర ప్రభుత్వ వినియోగదారు వ్యవహారాల విభాగ కార్యదర్శితో రష్యా వ్యవసాయ శాఖ ఉప మంత్రి భేటీ; పప్పు ధాన్యాల వ్యాపారంలో సహకారం అంశంపై చర్చలు

వినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తో  రష్యా వ్యవసాయ శాఖ ఉప మంత్రి శ్రీ మక్సిమ్ తితోవ్ …