కేంద్ర సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నేడు (నవంబర్ 5న) నిర్వహించిన తొలి ‘ఆసియా బౌద్ధ సదస్సు’ కు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము హాజరయ్యారు.
న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీమతి ముర్ము… భారతదేశం ధర్మానికి ఆలవాలమైన పుణ్యభూమి అని, యుగయుగాలుగా ప్రజలకు శాంతి సామరస్య మార్గాన్ని చూపిన రుషులు, ఆధ్యాత్మికవేత్తలు, మార్మికులకు దేశం నిలయమని అన్నారు. ఈ మార్గాన్వేషకులలో ప్రత్యేక స్థానం కలిగిన బుద్ధ భగవానుడు… గౌతమ సిద్ధార్థునిగా ఉన్న సమయంలో బోధ్ గయలోని బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన ఘట్టానికి సాటి రాగల క్షణం చరిత్రలో లేదని రాష్ట్రపతి అన్నారు. మానవ మస్తిష్కానికి చెందిన తీరుతెన్నులను అర్ధం చేసుకున్న బుద్ధుడు.. “బహుజన సుఖాయ, బహుజన హితాయ చ” అన్న భావనతో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టారని అన్నారు.
కాలక్రమేణా, బుద్ధుడి బోధనలను ఆయన అనుయాయులు అర్ధం చేసుకునే తీరులో కలిగిన మార్పులు వల్ల, సహజంగానే రకరకాల శాఖలు ఏర్పడ్డాయని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. స్థూలంగా థేరవాద, మహాయాన, వజ్రయాన ముఖ్య శాఖలైనప్పటికీ వీటిల్లో అనేక ఉపశాఖలు కనిపిస్తాయన్నారు. వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు విస్తరించిన బౌద్ధ ధమ్మం, తిరిగి పెద్ద సంఘంగా రూపుదిద్దుకుందన్నారు. బుద్ధుడి జ్ఞానోదయానికి కేంద్రమైన భారతదేశం, ఈ సంఘానికి కూడా కేంద్ర బిందువుగా ఉందన్నారు. సర్వవ్యాపి అయిన భగవంతుడికి ఆద్యంతాలను ఎలా కనుగొనలేమో, అదే విధంగా బౌద్ధ సంఘానికి ఆది, అంతాలను కనుగొనలేమని చెప్పారు.
వాతావరణ పరంగా, యుద్ధాల పరంగా అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటున్న నేటి ప్రపంచానికి బౌద్ధం సరైన మార్గం చూపగలదని శ్రీమతి ముర్ము అన్నారు. సంకుచితమైన మనస్తత్వంతో విభజనలు ఏర్పరుచుకుంటున్న మానవులకు, బౌద్ధ సంఘం ఏకత్వాన్ని బోధించగలదన్నారు. శాంతి, అహింసలకు బౌద్ధ మతం మారుపేరనీ, బౌద్ధ ధమ్మాన్ని ఒక్క మాటలో వివరించదలచుకుంటే… కరుణగా అభివర్ణించవచ్చనీ, కరుణా గుణం నేటి సమాజానికి అత్యంత అవసరమైనదని రాష్ట్రపతి చెప్పారు.
ఉమ్మడి కార్యచరణ ద్వారా బుద్ధుడి బోధనలు గల గ్రంథాల పరిరక్షణ సాధ్యపడిందన్న రాష్ట్రపతి, పాళీ, ప్రాకృత భాషలకు భారత ప్రభుత్వం ప్రాచీన భాషల హోదాను కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఆ రెండు భాషలకు అందించే ఆర్ధిక సహాయం ద్వారా ఆయా భాషల్లోని ప్రాచీన సాహిత్య సంరక్షణ, పునరుద్ధరణ సాధ్యపడతాయని రాష్ట్రపతి అన్నారు.
ఆసియా ఖండాన్ని బలోపేతం చేయడంలో బౌద్ధ ధమ్మ పాత్రను చర్చించవలసిన అవసరాన్ని ప్రస్తావించిన శ్రీమతి ముర్ము, ఆసియా ఖండానికీ, ప్రపంచానికీ నిలకడైన శాంతిని అందించడంలో బౌద్ధం కీలక పాత్ర పోషించగలదన్నారు. హింస లేని శాంతికి మాత్రమే పరిమిత దుఃఖానికి హేతువులైన దురాశ, ద్వేషాల నుంచీ విముక్తిని పొందగలిగినప్పుడే నిజమైన శాంతి లభిస్తుందని వ్యాఖ్యానించారు. బుద్ధుడి బోధనలను అనుసరించే భారతదేశం..సమాఖ్యలో సభ్యులైన ఇతర దేశాలూ, పరస్పర సహకారంతో ముందుకు సాగడంలో నేటి సదస్సు సహాయపడగలదన్న విశ్వాసాన్ని శ్రీమతి ద్రౌపదీ ముర్ము వ్యక్తపరిచారు.