సముద్రంలో భారత నావికా దళ కార్యాచరణ ప్రదర్శనను గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గురువారం వీక్షించారు. ఐఎన్ఎస్ హన్సా (గోవా నావిక దళ ఎయిర్ స్టేషన్)కు విచ్చేసిన రాష్ట్రపతికి నావికదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠితోపాటు పశ్చిమ నావిక దళం ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ ఎడ్మిరల్ సంజయ్ జె. సింగ్ స్వాగతం పలికారు. ఆమె రాక సందర్భంగా 150 మందితో కూడిన సైనిక బృందం గౌరవ వందనం సమర్పించింది.
అనంతరం భారత నావిక దళానికి చెందిన 15 ప్రధాన యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో కూడిన, దేశీయంగా రూపొందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను గోవా సముద్ర తీరంలో గౌరవ రాష్ట్రపతి ప్రారంభించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సముద్రంలో భారత నావికాదళ నౌకలను సందర్శించడం ఇదే మొదటిసారి. నావిక దళం నిర్వహించే పాత్ర, కార్యాచరణ, పనితీరు తదితర అంశాలను ఈ సందర్భంగా రాష్ట్రపతికి అధికారులు వివరించారు. అనంతరం రాష్ట్రపతి పలు నావిక దళ కార్యకలాపాలను వీక్షించారు. ఓడ తలం మీది నుంచి యుద్ధ విమానాలు పైకెగరడం, దిగడం, యుద్ధ నౌక నుంచి క్షిపణి ప్రయోగ విన్యాసాలు, జలాంతర్గామి కార్యకలాపాలు, 30కి పైగా ప్రత్యేక విమానాలను రాష్ట్రపతి పరిశీలించారు. చివరిగా, గతంలో ఆవిరితో నడిచే సాంప్రదాయక యుద్ధ నౌకలను వీక్షించారు.
మధ్యాహ్న భోజన సమయంలో రాష్ట్రపతి ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బందితోనూ సంభాషించారు. అనంతరం నావికా దళాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అన్ని విభాగాలకూ ఆమె ప్రసంగాన్ని ప్రసారం చేశారు.