దూసుకొస్తున్న దానా తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో, ఈశాన్య ప్రాంతపు తీర రక్షక దళం (ఐసీజీ) అప్రమత్తమైంది. దానా గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రాణ, ఆస్తి నష్టాలని నివారించేందుకు, తుఫాను వల్ల ఉత్పన్నమయ్యే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు.. అనేక ముందు జాగ్రత్త చర్యలను తీసుకొంది.
జాలర్లూ, సముద్ర నావికులు ఎప్పటికప్పుడు హెచ్చరించే బాధ్యతను పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని నౌకలూ, విమానాలూ, రిమోట్ స్టేషన్లకు అప్పగించింది. దాంతో… సముద్రంలోని అన్ని నౌకలూ వెంటనే తీరానికి చేరుకోవాలంటూ నిరంతరాయంగా హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
తుఫాను వల్ల ఎటువంటి అత్యవసర స్థితి ఏర్పడ్డా, వెంటనే రంగంలోకి దిగేందుకు అనువుగా ఐసీజీ సహాయక పడవలనూ, హెలికాప్టర్ల నిర్ణీత స్థానాల్లో మొహరించింది. అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించేందుకు స్థానిక పరిపాలనా యంత్రాంగం, విపత్తు నిర్వహణ దళాలతో కలిసి పనిచేస్తోంది.
తుఫాను తీరాన్ని దాటే వరకూ సముద్రం వైపు వెళ్ళవద్దని, అప్రమత్తత పాటించాలనీ జాలర్లను గ్రామ పెద్దల ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా హెచ్చరిస్తున్నారు. హై అలర్ట్ పాటిస్తున్న తీరరక్షక దళం, అవసరమైన సహాయాన్ని అందించేందుకూ, సహాయక చర్యల్లో పాల్గొనేందుకూ బృందాలతో, సామగ్రితో సన్నద్ధంగా ఉంది.