ఆగ్రాలోని వాయుసేన కేంద్రంలో సీ-295 తరహా విమానాల సిమ్యులేటర్ (నమూనా) వ్యవస్థను ఎయిర్ చీఫ్ మార్షల్, ‘సెంట్రల్ ఎయిర్ కమాండ్’ కమాండింగ్-ఇన్-చీఫ్, ఆశుతోష్ దీక్షిత్ నిన్న (నవంబర్ 11న) ప్రారంభించారు. పైలట్లకు నమూనా వ్యవస్థలో శిక్షణనివ్వడం వల్ల అమూల్యమైన వనరులు ఆదా అవుతాయి.
వాస్తవ పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల నుంచీ పైలట్లు చేపట్టే సైనికుల/సరుకుల రవాణా, ప్యారాచూట్ల ద్వారా సరుకుల చేరవేత, ప్యారాచూట్ విన్యాసాలు, సేనల వైద్యపరమైన తరలింపు తదితర పనులకు సంబంధించిన శిక్షణను ఈ అత్యాధునిక సిమ్యులేటర్ వ్యవస్థల ద్వారా అందిస్తారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల శిక్షణను కూడా అందించి, పైలట్లను యుద్ఢ సన్నద్ధులుగా తీర్చిదిద్దుతారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో క్షణాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం సహా పైలట్ల నైపుణ్యాలకు మెరుగులు దిద్దే సిమ్యులేటర్ శిక్షణ ద్వారా సైనిక చర్యల్లో భద్రత పెరుగుతుంది.
భారత వాయుసేనలోకి సీ-295 విమానాలను ప్రవేశపెట్టడం ద్వారా దేశ వైమానిక రంగానికి అనేక రకాల లబ్ధి చేకూరుతుంది. రవాణా విమానాల తయారీలో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించడం వల్ల వైమానికరంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆశయ సాకారం దిశగా తొలి అడుగులు పడుతున్నాయి.