విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాశాఖ- హైదరాబాద్ ఐఐటీలో మానసిక ఆరోగ్యంపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. నవంబరు 9 నుంచి రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. మానసిక ఆరోగ్యం, సమస్యలను తట్టుకునే శక్తి, శ్రేయస్సును ప్రోత్సహించే సమగ్ర విధానమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. విద్యార్థులూ, అధ్యాపకుల మానసిక ఆరోగ్యానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవస్థలను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్యాసంస్థలకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.
ఈ నిపుణుల సభను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ కె. సంజయ్ మూర్తి ప్రారంభిస్తారు. హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ రీనా సోనోవాల్ కౌళి ఈ సదస్సులో పాల్గొంటారు. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య సుహృద్భావ సంబంధాల ప్రాధాన్యాన్ని విద్యా సంస్థలకు తెలియజేసే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పిస్తుంది. ఇందుకోసం హైదరాబాద్ ఐఐటీని ‘ఆతిథ్య సంస్థ’గా గుర్తించారు. ఇది సదస్సుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు నిర్వహణపరమైన మద్దతు, రవాణా సహకారాన్నీ అందిస్తుంది.
మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు ఆవశ్యకత, ప్రస్తుత ధోరణులపై మానసిక ఆరోగ్య నిపుణులు, విద్యార్థులు, అధ్యాపకులు చర్చిస్తారు. సమగ్ర సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలతోపాటు, మానసిక ఆరోగ్య పర్యవేక్షణ కోసం కృత్రిమ మేధను వినియోగించడం, విభిన్న కార్యక్రమాల ద్వారా విద్యాసంస్థల ప్రాంగణంలో సహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడం, ముఖాముఖి కార్యక్రమాలతో కుటుంబాలనీ, కొత్త విద్యార్థులనీ భాగస్వాములను చేయడంపై సదస్సులు నిర్వహించి పలు అంశాలపై చర్చిస్తారు.