2024 సంవత్సరం విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు (నవంబర్ 8న) హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి… క్రమశిక్షణ, నీతీ నిజాయితీలను భారతీయలు ఉన్నత ఆదర్శాలుగా భావిస్తారని అన్నారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని ఇష్టపడని భారతీయులు, చట్టాన్ని గౌరవిస్తారనీ, ఆర్భాటాలు లేని సాదాసీదా జీవితాలను గడిపేందుకు ఇష్టపడతారనీ 2300 ఏళ్ళ కిందటే ప్రఖ్యాత గ్రీకు చరిత్రకారుడు మెగస్థనీస్ పేర్కొన్నారని గుర్తు చేశారు. చైనా చరిత్రకారుడు ఫాహియన్ తదితరులు కూడా మన పూర్వీకుల నిరాడంబరత గురించి పేర్కొన్నారని శ్రీమతి ముర్ము చెప్పారు. ఈ నేపథ్యంలో ‘చిత్తశుద్ధి ద్వారా జాతి సౌభాగ్యం’ అంటూ విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలకు ఈ యేడాది ఇచ్చిన ఇతివృత్తం ఎంతో బాగుందని ప్రశంసించారు.
సామాజిక జీవనానికి నమ్మకం పునాది వంటిదని, ఐక్యతకు అదే సూత్రమనీ, ప్రభుత్వం చేపట్టే సంక్షేమం, వివిధ కార్యక్రమాలపై ప్రజలకు గల నమ్మకమే ప్రభుత్వ పాలనకు బలాన్ని అందిస్తుందని రాష్ట్రపతి అన్నారు. అవినీతి ఆర్థిక పురోభివృద్ధిని కుంటుపరచడమే కాక, విశ్వాస రాహిత్యానికి దారితీస్తుందన్నారు. ప్రజల పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసి, దేశ ఐక్యత సమగ్రతలకు చేటు కలిగిస్తుందని చెప్పారు. ప్రతి సంవత్సరం, సర్దార్ పటేల్ జయంతి నాడైన అక్టోబర్ 31న దేశ ఐక్యత సమగ్రతలను కాపాడతామంటూ ప్రతిన పూనుతామని గుర్తు చేస్తూ.. ఈ ప్రతిజ్ఞ కేవలం ఆనవాయితీగా చేసేది కాదని, పూర్తి నమ్మకంతో చేపట్టే సంప్రదాయమని శ్రీమతి ముర్ము అన్నారు. నిజాయితీతో ప్రతిజ్ఞను పాటించవలసిన ఉమ్మడి బాధ్యత మనపై ఉందని రాష్ట్రపతి అన్నారు.
నైతికతకు పెద్దపీట వేసే భారత దేశంలో డబ్బు, ఆస్తి, వస్తువుల సంపాదనే ధ్యేయంగా జీవన స్థాయిని పెంచుకునేందుకు తంటాలు పడే కొందరు… ఈ సూత్రానికి దూరమవుతూ అవినీతికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కనీస అవసరాలు తీర్చుకున్నాక ఆత్మ గౌరవంతో బతకడంలోనే సిసలైన సంతోషం దాగుందని అన్నారు.
నిబద్ధతతో చేపట్టిన ఏ పనికైనా విజయం లభించడం తథ్యమని రాష్ట్రపతి అన్నారు. భారతదేశానికి అపరిశుభ్రత రాసిపెట్టి ఉందని కొందరు నమ్మినా.. స్థిరమైన నాయకత్వం, ప్రభుత్వ పట్టుదల, పౌరుల భాగస్వామ్యాలు ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు తెచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. అవినీతిని రూపుమాపడం అసాధ్యమనే నిరాశావాదుల తీరు సరైనదిగా చూడలేమన్న రాష్ట్రపతి… ‘అవినీతి పట్ల కఠిన వైఖరి’తో మెలగాలన్న ప్రభుత్వ విధానం వల్ల అవినీతిని కూకటివేళ్ళతో పెకిలించడం సాధ్యపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అవినీతికి పాల్పడ్డ వారిపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవడం అత్యవసరమన్న రాష్ట్రపతి.. ఈ విషయంలో తాత్సారం, లేదా బలహీనమైన చర్యల వల్ల అవినీతిపరులకు ప్రోత్సాహం లభిస్తుందని హెచ్చరించారు. అదే సమయంలో వ్యక్తులనూ, వారి ప్రతి చర్యనూ అనుమానంతో చూడరాదన్న విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత పగతో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టడం సబబు కాదనీ, వ్యక్తుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలు తీసుకోరాదని చెప్పారు. అందరికీ సమానత్వం, సమాన న్యాయం అందించే లక్ష్యంతో పనిచేయాలని శ్రీమతి ద్రౌపదీ ముర్ము హితవు పలికారు.