ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల వెంబడి దానా తుఫాను తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం మానవతా సహాయం, విపత్తు ఉపశమన (హెచ్ఏడీఆర్) కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని నౌకాదళ అధికారుల (ఎన్ఓఐసీ) సమన్వయంతో తూర్పు నౌకాదళ కమాండ్ సమగ్ర విపత్తు ప్రతిస్పందన కార్యాచరణను రూపొందించింది. ఆహార పదార్థాల నిల్వ యార్డు (బీవీవై), మెటీరియల్ ఆర్గనైజేషన్, నౌకాదళ ఆసుపత్రి ఐఎన్‌హెచ్ఎస్ కల్యాణి తదితర విభాగాలతో కలసి రాష్ట్ర అధికారుల విజ్ఞప్తి మేరకు అవసరమైన సామగ్రి, వైద్య సహాయం అందిస్తుంది.
దీనిలో భాగంగా అవసరమైన దుస్తులు, తాగునీరు, ఆహారం, ఔషధాలు, అత్యవసరాలతో కూడిన హెచ్ఏడీఆర్ సహాయ సామగ్రిని సిద్ధం చేశారు. వీటిని తుఫాను ప్రభావిత ప్రాంతాలకు రోడ్డు మార్గంలో తరలిస్తారు. అవసరాన్ని బట్టి సహాయ, ఉపశమన కార్యక్రమాల్లో పాలు పంచుకొనేందుకు గాను అదనంగా వరద సహాయం, డైవింగ్ బృందాలను సిద్ధం చేస్తున్నారు.
సముద్ర ఉపరితలం నుంచి సాయం అందించేందుకు సామగ్రితో పాటు సహాయ, డైవింగ్ బృందాలతో రెండు నౌకలు సిద్ధంగా ఉన్నాయి.
దానా తుపాను కదలికల ప్రభావాన్ని నిశితంగా గమనిస్తూ.. అధికారులు, ప్రజలకు అవసరమైన సాయాన్ని అందించేందుకు భారత నౌకాదళం సిద్ధంగా ఉంది.