ఇగాస్ పండుగ సందర్భంగా పౌరులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, వారసత్వంల మేలికలయికతో మునుముందుకు సాగిపోయేందుకు దేశం కంకణం కట్టుకొందని ఆయన వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్ పౌరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఇగాస్ పండుగ వారసత్వం మరింతగా వర్ధిల్లగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఇగాస్ పర్వ్ సందర్భంగా ఉత్తరాఖండ్ లోని నా కుటుంబ సభ్యులు సహా దేశవాసులందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఢిల్లీలో, ఉత్తరాఖండ్‌కు చెందిన లోక్ సభ సభ్యుడు అనిల్ బలూనీ జీ ఇంట్లో నిర్వహించిన పండుగ వేడుకలలో పాలుపంచుకొనే అదృష్టం ఈరోజు నాకు దక్కింది. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవనంలోనూ సుఖాన్నీ, సమృద్ధినీ, సంతోషాన్నీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను @anil_baluni’’
‘‘అభివృద్థితో పాటు వారసత్వాన్ని కూడా పెనవేసి పురోగమించాలని మేం కంకణం కట్టుకొన్నాం. దాదాపుగా కనుమరుగైపోయిందనుకున్న జానపద సంస్కృతితో ముడిపడిన ఇగాస్ పండుగ మరో సారి ఉత్తరాఖండ్ లోని నా కుటుంబ సభ్యుల్లో భక్తి విశ్వాసాలకు కేంద్రంగా మారుతూ ఉండడం చూస్తే నాకు సంతోషం కలుగుతోంది.’’
‘‘ఉత్తరాఖండ్ లోని నా సోదర, సోదరీమణులు ఎంత ఉత్సాహంగా ఇగాస్ పండుగ సంప్రదాయానికి ప్రాణం పోశారో గమనిస్తే చాలా సంతోషం కలగడం ఖాయం. ఈ పవిత్రమైన పండుగను దేశమంతటా పెద్ద ఎత్తున చేసుకొంటుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దేవభూమి కి చెందిన ఈ వారసత్వం పుష్పించి, ఫలిస్తుందని నేను నమ్ముతున్నాను.’’